Monday, 27 June 2011

అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి

సోది కబుర్లు తో పాటు చిన్నప్పుడు నాకో సుత్తి అలవాటు ఉండేది ... మా అమ్మమ్మ ఎవరిని ఏమని పిలిస్తే నేను అలాగే పిలిచేదాన్ని... కంగారు పడకండి ... తాతయ్యని మాత్రం తాతయ్య అనే పిలిచేదాన్ని లే ...


అలా అరుంధతి లో జేజమ్మ లా నేను అమ్మమ్మ పాత్ర పోషిస్తూ మా అమ్మని " అమ్ములు" అని మా నాన్నని " ఏరా తమ్ముడు" అనేదాన్ని ........ అంతే కాదు మా ఇంటి పక్కన 70 ఏళ్ళ మామ్మ గారిని కూడా అక్క అనే పిలిచేదాన్ని మా అమ్మమ్మ పిలుస్తుందని ............


నా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకూ మా నాన్న నన్నెప్పుడూ చిన్న మాట కూడా అని ఎరగరు...దానితో

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు .... నాలో ఉన్న సుగుణం కాస్తా నాకంటే ముందే పుట్టి పెరిగి పెద్దదయి పెద్దదయి ... ఇంతింతై వటుడింతై మా ఇంటి పైకప్పంతై అన్న రేంజ్ లో మా పెద్దనాన్నలని కూడ ఒరేయ్ తమ్ముడూ... మీ ఆవిడని అమ్మమ్మ పిలుస్తుంది రా అనడం మొదలు పెట్టాను ...


అంతే కాదు మా ఇంటికి చుట్టాలెవరయినా వస్తే ... మొన్న వచ్చి డ్రింకులు బోలెడు స్వీట్లు పంది కొక్కుల్లా తినేసి పోయారు కదా అంకుల్ గారు ఆంటీ గారు (కాసింత గౌరవంగా ?) వచ్చారు డాడీ అని వాళ్ళ మొహం మీదే గారాలు పోతూ ముద్దుముద్దుగా మురిసిపోతూ చెప్పేదాన్ని... అంత అపరిమితమయిన గౌరవం ఇచ్చే సరికి ఇంత లేత వయస్సులోనే నా లో దాగున్న అంత వినయాన్ని చూసి వచ్చిన వాళ్ళు , పుత్రికోత్సాహంతో మా నాన్న ఆనందం తో ఉబ్బితబ్బిబ్బు అయిపోయేవారు...


. అంత గొప్ప ఆనంద సమయంలో మా అమ్మ సంతోషం తో గోల్డ్ మెడలో , డాక్టరేటో ఇచ్చి నన్ను పొగడ్తలతొ ముంచేసి ముద్దులతో మురిపించేస్తుంది అని ఆశగా ఆత్రుత గా నిలబడి ఎదురు చూస్తున్న నన్ను ఇంటి చుట్టూ పరుగులు పెట్టించి మరీ ఆయాసం వచ్చేవరకు నన్ను చితకబాదేసి... అలా పిలవడం మానేస్తావా లేదా అని నా నోటిలో కారం రాసేసి... నా వినయ విధేయతలని కాలరాసేసేది మా అమ్మ ...గారం గారెలకి ఏడిస్తే వీపు దెబ్బలకి ఏడ్చిందంటే ఇదేనేమో ....


మా అమ్మకి నాన్న మేనమామ అవుతారు .... అందుకే మా అమ్మకి నాన్న దగ్గర చనువెక్కువ ... అదేమిటో కాని మా నాన్నకి మాత్రం మా అమ్మంటే బోలెడంత భయం...బత్తి....


భయం ఎంతంటే ఎలా చెప్పేది ??? ఎలా వర్ణించేది?? .....నిద్రపోతున్న మా నాన్న దగ్గరికెళ్ళి డాడీ నీ వెనకాలా అమ్మ అనగానే మెరుపు తీగలా పరిగెత్తుకెళ్ళి సోఫా కిందో బీరువాలోనో దాక్కోనేంత . ...... ( మాట ఎక్కడ చెప్పొద్దూ సుమీ........ మరేమో నాన్న గారు చెప్పారండి ఇంటిలో విషయాలు బయట అస్సలు చెప్పకూడదని.. ... )


ఏమిటి నాన్నా అన్యాయం.. అరాచకం... దురాచారం నేను భరిస్తూ ఇక బ్రతకలేను అర్జెంట్ గా వెళ్లి నుయ్యో గొయ్యో చూసుకుంటాను అవీ దొరక్కపోతే సుమన్ బాబు సినిమా చూసో చచ్చిపోతాను అని ఏడుస్తుంటే నా బాధ చూసి తట్టుకోలేని మా నాన్న ... ఒరేయ్ విధి ఆడే వింత నాటకంలో కేవలం మనం ఇద్దరు పావులం మాత్రమే...జీవితం అనే సీరియల్ లో అమ్మ డైరెక్టర్ మనం ఆర్టిస్ట్ లు ..........మీ అమ్మ చెప్పినట్టు మనం వినాలి కాని మనం చెప్పినట్టు మీ అమ్మ వినదు... వినబోదు... ఆరు నూరు అయినా నూరు నూట పదహారు అయినా సరే గెలుపు మాత్రం ఎప్పుడూ అమ్మ వైపే ఉండాలి ... .. అప్పుడే మన జీవితం ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతుంది ...ప్రేక్షకులు కూడా నూటికి నూరు మార్కులు వేస్తారు ..మూడు ఎపిసోడ్ లకి ఇలా బాధపడితే మిగతా వేల ఎపిసోడ్ లు ఏమయిపోవాలి ....చేయించేది అమ్మ ... చేసేది అమ్మ మధ్యలో నేను నిమిత్తమాత్రుడిని అని మా నాన్న బిక్క మొహం వేసుకుని వా పోతుంటే ... ఇంక చేసేదేమీ లేక, ఏమి చెయ్యాలో చేత కాక ఏమి చెయ్యడానికి పాలుపోక , వేరే దారి లేక అప్పటి నుండి కారం కూడా కేడ్బరీ లా ఆస్వాదించడం ఎలాగో మా నాన్న దగ్గర ట్యూషన్ చెప్పించుకుని మరీ నేర్చుకునేదాన్ని...


అలా ట్యూషన్లో మా నాన్న చెప్పిన జీవిత సత్యాలు వినేసరికి నాకున్న చిన్న మెదడు, పెద్ద మెదడు,అరికాళ్ళు ,మోకాళ్ళు ,వేళ్ళు ,గోళ్ళు పళ్ళు , వగయిరా వగయిరా లన్ని మొద్దుబారి పోవడం మొదలుపెట్టాయి ...


food corporation of India కి వెళ్ళాల్సిన ఫుడ్ అంతా నాకు ఒక్కరోజులోనే తినిపించే మా అమ్మ .... రోజు ఫుడ్ గ్రెయిన్స్ స్కాంలో ఇరుక్కొంటానో తెలియక భయంతో బాధతో బ్రతుకు భారంగా ఈడ్చుతున్న నేను... క్యారెట్ కోడిగుడ్డు కలిపి వండిన కూర చూసికూడా కోడిగుడ్డు పొట్లకాయలా భావించకుండా తినే మా నాన్న... నేను చెబుతున్న సోది భారతం అంతా శ్రద్దగా చదివే మీరు అందరం విధి వంచితులమే .... విధి కి బానిసలమే


అమ్మవారికి కుంభాభిషేకం జరిపినట్టుగా నాకు ఏడు ఇడ్లీలు పెట్టినా ఏడవకుండా తినాల్సోచ్చేది ... నాకసలే బద్ధకం ఎక్కువ ... అలాంటిది ఇవన్నీ శ్రద్దగా నమలాలంటే ఎంత కష్టమో నమిలే నాకు తప్ప పెట్టే మా అమ్మకి , చూసే మీకు తెలియదు ..... తెలియదు.... తెలియదు.


ఇంత తిండి నమిలి నమిలి ఇంకో పది సంవత్సరాలకి నా నోటిలో పళ్ళు అన్నీ అరిగిపోతే ... బ్లడ్ బ్యాంక్లు , కళ్ళు బ్యాంక్లు ఉన్నట్టు ..... డ్రెస్ మీదకి కలర్ మేచింగ్ పళ్ళ సెట్ పెట్టుకున్దామంటే ......పళ్ళ బ్యాంక్లు ఎక్కడా లేవు ...


ముంతాజ్ కి తాజ్ మహల్ లా ,వాణిశ్రీ కి ప్రేమ నగర్ లా ............. నాకోసం కనీసం ఒక్కటంటే ఒక్క పళ్ళ బ్యాంక్ కట్టించేవారు కూడా కరువయ్యారే లోకం లో ... ఇప్పుడు నాకు ఎవరు దిక్కు మొక్కు అని నాలో నేనే బాధపడేదాన్ని...


నా బాధ చూసి మా నాన్న కరిగి నీరై వరదై ... పోనీలేవే ... అది చెప్పింది నిజమే కదా ఒక్కసారి ఆలోచించరాదు అని నాకు సపోర్ట్ చేస్తే... " తిన్నందుకు ఊడిపోవు నీకులా అరగంట పళ్ళు తోమితే అరిగిపోతాయి " అని మా నాన్న మీద కయ్యమనేది అమ్మ...


మా అమ్మ చెప్పిన దానిలోను నిజం ఉంది . నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు కదా అని తినడం పళ్ళు తోమడం అనే lesson లో మా అమ్మ ఎంత గైడెన్స్ ఇచ్చినా పనిలో పర్ఫెక్షన్ సాధించలేకపోయాము... సాధించలేకపోతే సాధించలేకపోయాము కనీసం పుకారు వైరస్ లా ఊరంతా పాకి పదిమందికి సోకక ముందే సైలెంట్ గా ఉండడం మంచిదని కుక్కిన పేనులా కిక్కురుమనకుండా పడి ఉండేవాళ్ళం ....


చిన్నప్పటి నుండి ఇదే తంతు ... తిండి ... తిండి... తిండి... స్కూలుకి వెళ్ళేటప్పుడు ఇంటి ఆడపడుచుని వట్టి చేతులతో పంపించకూడదని మా అమ్మ బ్యాగ్ నిండా పుస్తకాలకి బదులు తిండే పెట్టేది ...


మా క్లాస్ లో ఎవరివైనా పెన్నులో పుస్తకాలో పొతే క్లాస్ లో అందరి బ్యాగ్ లు చెక్ చేసే వాడు మా క్లాస్ లీడర్ పీ.వి. నరసింహారావు ..


నా బ్యాగ్ దులిపి దులపగానే పురావస్తు శాఖ త్రవ్వకాలలో బయటపడ్డట్టు నా తిండి అంతా వచ్చి కుప్పలు తెప్పలుగా పడిపోయేది .... పాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరకాల్సిన తిండి అంతా ఫ్రీగా నా బ్యాగ్ లో దొరికేసరికి నా ఫ్రెండ్స్ కి నా మీద అభిమానం బుసలు కొట్టుకుంటూ పొంగుకోచ్చేసి ఎత్తుకుని మరీ తిప్పేవారు..." మాష్టారు నా మీద కోప్పడుతున్నారు... నువ్వు బ్యాగ్ లో ఏమీ పెట్టకు తల్లోయ్ నేను తీసుకువెళ్ళను " అని ఏడుస్తుంటే ... మా అమ్మమ్మ వచ్చి ... అన్నీ నువ్వు ఒక్కదానివే తినేయకు ... కొన్ని మాస్టారుకి కూడా పెడుతూ ఉండవే అని ఉచిత సలహా ఒకటి పారేసేది...


ఒక్క రోజు నేను స్కూల్ కి రాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో విలవిల్లాడిపోయి ..తల్లడిల్లిపోయి ... బెంగ పడిపోయేవారు .. నేను లేని లోటు కనీసం నా బ్యాగ్ ని చూసయినామర్చిపోతామని... కనీసం నా బ్యాగ్నన్నా పంపించమని ప్రాధేయపడేవారు ...


దశ బాగున్నవాడు ఈశాన్యంలో మంటపెట్టినా హేపీగానే ఉన్నాడట... నాలాంటి దానికి .. దిశ మారినా దశ మారే రాతా , యోగ్యతా లేవు ... అలా నా జీవితం స్కూల్ బ్యాగ్ నుండి కాలేజి బ్యాగ్ కి మారినా మన దశలో మార్పు చేర్పూ లేకుండా ఉండి పోయింది ....డిగ్రీ లోకివచ్చినా మాత్రం డిగ్రీ పెరిగే అవకాసం లేకుండా పోయిందిపైగా మా కాలేజీ పక్కనున్న సిటీలో ఉండడం వల్ల కొంప కాస్త కొల్లేరయిపోయింది ... అక్కడ నుండి కావలసిన సామాన్లన్నీ నా బ్యాగ్ ద్వారానే రవాణా అయ్యేవి ....


కన్నతల్లి కోరిక కాదనలేని నా చిట్టి హృదయం నయాపైసా కూలి తీసుకోకుండా ఏవి పడితే అవి ఊరికే మోసుకోచ్చే మనేది... ఇంత కష్టపడి పక్క ఊరి నుండి స్మగ్లింగ్ చేసుకొస్తుంటే చివరికి నీళ్ళ మగ్గులు, బకెట్లు కూడా కొని తీసుకురమ్మని ఆర్డర్ పడేసేది అమ్మ ...


చూసేవాడికి ..... మోసేవాడు ఎప్పుడూ లోకువే ... ఎదవ చెర....ఎదవ జీవితం... ఇలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదు ...


ఇలాంటి మాస్స్ ఐటమ్స్ నేను తీసుకువచ్చేది లేదని బల్లలు , పీటలు గుద్ది చెబితే చేతికి దెబ్బ తగులుతుందని మా చెల్లిని గుద్ది గట్టిగా అరిచి చెప్పేదాన్ని ... మా చెల్లి ఇంకో నాలుగు వాయించేది నన్ను.......మా చెల్లి ఎప్పుడూ అంతే నేను ఒక్కటిస్తే నాకు మాత్రమే ఎప్పుడూ స్వీట్ గా తిరిగి నాలుగిస్తుంది నేనంటే అంత ప్రేమ దానికి ...ఇక నేను తీసుకురానని కిందా పైనా పడి దొర్లిదొర్లి ఏడుస్తుంటే ఆఖరి అస్త్రం మా నాన్న మీద సంధించేది ... తెచ్చిన వస్తువు బాగుందని మా అమ్మ చేత అనిపించలేక షాపు వాడికి తిరిగి ఇవ్వలేక మా నాన్న పడే కష్టాలు చూసి నా మనస్సు తరుక్కుపోయేది ..షాపు వాడు మా అమ్మ ఎడా పెడా ఆడేసుకునేవారు ......... పాపం పసివాడు అని అనిపించేది కాని .........అయ్యో పాపం అని గట్టిగా అంటే పాపం నా నెత్తికి చుట్టుకుంటుంది మనకెందుకు లే అని నోరు మూసుకుని చూసేదాన్ని...


PG లోకి వచ్చిన KG చదివే పిల్లకి చెప్పినట్టు ఇప్పటికీ ఎన్ని జాగ్రత్తలు చెబుతుందో ... రోజు చెప్పేవే, అన్నీ తెలిసినవే అయినా నాకు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఒకేసారి చెబుతున్నాను వినండహో అన్నట్టుగా... వీధి చివరి వరకు చెబుతూనే ఉంటుంది..


కంప్యూటర్ని తడిచేతులతో ముట్టుకోవద్దని ... అన్నం పడేయోద్దని ... రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమని ... అంతగా కష్టమయితే ఎవరినయినా రోడ్డు దాటించమని ....


నేనేమన్నా పసి పిల్లనా తెలియక పాక్కుంటూ రోడ్డు దాటేయడానికి ... రోడ్డు కూడా దాట లేకపోవడానికి , ఎవరినో దాటించమనడానికి నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా , గుడ్డిదాన్నా ముసలిదాన్నా..... ఛీ ఎదవ జీవితం ఎంత తియ్యగా ఉంటే మాత్రం ఏం లాభం ...


అలాగే ఇంకో భయకరమైన ఆయుధం ఒకటి నాకెప్పుడూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపుతుంది మా అమ్మ .... అది కత్తో, గన్నో , వేటకొడవలో అనుకుంటే పొరపాటు అది ............అది........ గొడుగు ..........


మా వూరిలో కాలం.. కాలం.. కాలం .. అనే తేడా లేకుండా సర్వ కాలాల్లో సర్వావస్థలయందు గొడుగు వేసుకుని తిరిగే ఏకైక యువతిని నేనే ... యముడికి గద లాగా, కర్ణుడికి కవచకుండలాలు లాగా... గొడుగు ఎప్పుడూ నా తోనే... నేనెక్కడుంటే అది అక్కడే ఉంటుంది .నన్ను విడిచి అది దాన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేము తింగరి మొహం .. మా వూరిలో గొడుగుల కంపెనీ తరపున ఏకైక బ్రాండ్ అంబాసిడర్ ని కూడా నేనే ...


వచ్చే వాళ్ళు... వెళ్ళే వాళ్ళు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తుంటే గొడుగు వల్లే నేను లేడీ జేమ్స్ బాండ్ లా కనిపిస్తున్ననేమో అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ... నన్ను నా గొడుగుని చూసుకుని ... ఇలాంటి సమయంలో నల్ల కళ్ళజోడు కూడా ఉంటే ఎంత బాగుండేది... మంచి రిచ్ లుక్ వచ్చేది అనుకునేదాన్ని...


ఫొజులు కొడితే ఫ్యూజులు మాడిపోతాయని తరువాత తరువాత తెలిసింది .....రోజు అదేదో టివి చానెల్ యాంకర్ లా గొడుగేసుకుని బయలుదేరాను... మా ఆఫీసుకి వెళ్ళే దారిలో వినాయకుడి ఉంది ... వినాయకచవితి సందర్భంగా గుడిలోనుండి పాత పాటలు వస్తున్నాయి... కడవెత్తు కొచ్చింది అని ...

ఏమరుపాటుగా ఉన్న నాకు పాట గోడుగేసుకోచ్చింది అని వినిపించి.... ఒక్కసారిగా నా గుండె గుభేల్మంది ... ఎంత ప్రయత్నించిననా కొట్టుకోనని మొరాయించింది ... ఇంకా నయం డౌట్ నాకొచ్చింది కాబట్టి సరిపోయింది ... ఎంత అవమానం ...ఎంత అవమానం.... గొడుగు నన్ను మింగేయడానికే వచ్చింది... ఇక గొడుగు నేను చస్తే తీసుకెళ్ళను అని ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకున్నా మా అమ్మ వినిపించుకోదు ...పైగా ఎండలో తిరిగితే జ్వరాలు వస్తాయి అని, కలర్ తగ్గిపోతామని ......నలుపు వచ్చేసి నీగ్రోజాతి బాల బాలికలా తయారవుతానని... ఇంకా ఏవో ఏవో పుస్తకాలలో చదివినవి, చదవనివి, చదవకూడనివి కూడా చెప్పి భయపెట్టేస్తుందిఅమ్మో జ్వరమా... నాకెప్పుడన్నా సెలవలు కావాలంటే అప్పుడు జ్వరాన్ని ప్రకటించుకునేదాన్ని కానీ నిజం జ్వరం మాత్రం సంవత్సరానికి ఒక్కసారే ...........అంటే సంవత్సరానికి ఒక్కసారి పరీక్షలు వచ్చేవి... పరీక్షలే నాకు జ్వరాన్ని తెచ్చి పట్టేవి .. .......


అదీ నేను మరీ బలవంత పెట్టేస్తే నన్ను భాధపెట్టలేక నా మాట కాదనలేక ఏదో మొహమాటం కొద్ది వచ్చేది పలకరించడానికి ...అలాంటి జ్వరం అంతే ఏంటో గౌరవ, అభిమానం, ఆరాధనా .......... అలా వచ్చిన జ్వరం అని తెలియక ... మా అమ్మ నాకు దెయ్యం పట్టిందానికి కట్టినట్టు ఒంటినిండా రకరకాల తాయెత్తులు కట్టేస్తుంటే ముడుపులు కట్టిన చెట్టులా కనిపించేసరికి జ్వరానికి కూడా వణుకు ,జ్వరం వచ్చేసేవి .......అలా జ్వరానికి కనీస మర్యాదలు కూడా చెయ్యలేక పోయేదాన్ని .....కనీసం జాకెట్టు ముక్క కూడా పెట్టకుండా వట్టి చేతులతో పంపించేసేదాన్ని ........ అందుకే జ్వరం కంటే గొడుగులు , మరచెంబుపట్టుకుని తిరగడమే కాస్త నయం అనిపిస్తుంది...ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే నీ వెదవ ఏడుపు ఆపి నా పెళ్ళికి వచ్చి అక్షింతలు వెయ్యి అని అడిగాడంట వెనకటికి ఎవరో ఒక పేద్ద మనిషి ... పోనీలే మా నాన్న అయినా నాకు సపోర్ట్ ఉంటారనుకుంటే రివర్స్ లో నేనే మా నాన్నకి సపోర్ట్ ఇవ్వాలి


అమ్మతో కలిసి అడ్డమైన చానెల్స్ చూస్తూ తలకిమాసిన టివి సీరియల్స్ లు చూడడం లో పాలు పంచుకుంటాడు ... సీరియల్ లో కారెక్టర్ కి అన్యాయం జరిగినా మహా ఘోరం , నేరం మా నాన్నే చేసాడు అంటుంది అమ్మ ... నువ్వు తుమ్మినప్పుడు వెళ్ళాడు కాబట్టి సీరియల్ లో హీరో కి ఏదో అయింది అంటుంది .. హీరో ఫేమిలీకి నువ్వే అన్యాయం చేసావు అంటుంది


ఎప్పుడన్నా పోనీలే మా అమ్మ సైలెంట్ గా ఉంది కదా అని అనుకుంటే ... ఎవరైనా పొగడమని రిక్వెస్ట్ చేస్తారు కానీ మా నాన్న తిట్టమని రిక్వెస్ట్ చేస్తాడు మా అమ్మని.... ఇలాంటి విచిత్రాలు విడ్డూరాలు మా ఇంటిలో మాత్రమే జరుగుతూ ఉంటాయి


. ఎందుకు నిద్రపోయే సింహం జోలికి వెళతావు అని మా నాన్నకి ఎన్ని చెప్పినా షరా మామూలే...పైగా అలా నటే మా అమ్మకి నా మీద ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది


"అదేలేవే రేపొద్దున్న నువ్వు కూడా నాలాగే ఉంటావు" అని మా అమ్మ నన్ను కోప్పడుతుంది .


"అయినా నేనేమి అలా ఉంటానా ?ఏమిటి ?? ... అయినా మా ఫేమిలీ విషయాలు మా అమ్మకేందుకో నాకు అస్సలు అర్ధం కాదు ...


అమ్మ ఎప్పుడూ పప్పుడబ్బాలు ఉప్పుడబ్బాలు అందించమంటుందే తప్ప వంట మాత్రం నేర్పడంలేదు. నా జీవితం సగం అవి అందించడంలోనే గడిచిపోయింది .

.. కనీసం నా అవసానదశలోనయినా ... కాస్త సొంతంగా వంట చేసి నీకు పెట్టనా నాన్నా అని ఎంతో ఆశగా అడుగుతానా

బాబోయ్ నీ వంట "వద్దురా నీకెందుకు అంత శ్రమ ...నిన్ను కష్టపెట్టలేను రా....... ఫ్యూచర్ లో మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నీ చేత వంటచేయింఛి నిన్ను కష్ట పెట్టలేను ... అప్పుడు కూడా మీ అమ్మతో కేరేజీ పెట్టించుకుని తెచ్చుకుంటాను అంటారు...అంటా సుత్తి


ఎప్పుడో ఒకసారి తోటకూర వేపుడు లో ఉప్పు బదులు సర్ఫ్ వేస్తే మాత్రం ... రోజూ సర్ఫ్ వేసి వండుతానా .... వేస్తే మాత్రం ఎప్పుడూ అదే కంపెనీ సర్ఫ్ వేస్తానా ఏమిటి ? ... మాత్రం నాకు తెలియదా... హిందూ స్త్రీ అయినా తన వంటని విమర్శిస్తే ఒప్పుకుంటుందా ????? మాత్రం దానికే నాలో కుక్ ని ఇంతలా చిన్న బుచ్చేయాలా...హుమ్మ్


మా నాన్న ఎప్పుడూ ఇంతే ... మా అమ్మ మా నాన్నని ఏదన్నా అంటే ... మా నాన్న " ఒరేయ్ నాకు సపోర్ట్ చేయరా " అని నన్ను జాలిగా అడగడం ... నా వెదవ గుండెకాయ కరిగిపోయి 'కంటే కూతుర్నే కను' సినిమాలో రమ్యకృష్ణ లా ఫీల్ అయిపోయి ముందు వెనకా ఆలోచించకుండా దూకేయడం ... తీరా దూకేసి దెబ్బలు తగిలించుకున్న తరువాత ఆయింట్మెంట్ కాదు కదా కనీసం నా వంక చూడనన్నా చూడకుండా ఇలా సగం లోనే హేండ్ ఇచ్చి మా అమ్మ పార్టీ లో కలిసిపోయి నన్ను వెన్నుపోటు పొడిచేయడం...


లోకులు కాకులు అని ఊరికినే అన్నారా ... లోకం అంతా మా నాన్నకి నేనంటే బోల్డంత ఇష్టం అనుకుంటుంది కాని.... మాయా మాయా అని మా అమ్మ మా నాన్నని పిలిచే పిలుపులో ఏం మాయ ఉందో తెలియదు కాని ... మా నాన్నకి మా అమ్మ అంటేనే చాలా ఇష్టం ......ఇదే అసలు సిసలైన పచ్చి నిజం..


లోకం ఇలాంటి పచ్చి నిజాన్ని ఎప్పుడూ అంత తొందరగా గ్రహించదు ... అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోని సమాజం అంటే నాకు అప్పుడప్పుడూ చాలా కోపంవస్తుంది ...............అందుకే కోపంతో అప్పుడప్పుడు నేను కొనుక్కున్న ఐస్ క్రీమ్స్ , చాక్లెట్స్ దానికి ఇవ్వడం మానేసాను ... అలాగే అప్పుడప్పుడు గాజులు, రబ్బరు బేండ్లు లాంటివి కొనుక్కున్నా సరే దానికి ఇవ్వకూడదనుకున్నాను ...


కాకిని కొట్టవే అని మా అమ్మ చెబితే వెళ్లి కాకిని కొట్టడం మానేసి .. మా అమ్మతో చెప్పమంటావా అని దానిని బెదిరించి పంపేసేవాళ్ళం నేను.. మా నాన్న ...


మీ అమ్మతో నేను వేగలేకపోతున్నా... పిన్నిని తీసుకురానా అని సరదాగా అనేవారు మా నాన్నా... మేము కూడా తీసుకురా డాడీ అని జోక్ చేసేవాళ్ళం ...కానీ పైన తదాస్తు దేవతలు ఉంటారని... నాన్న పులి కథలా ... సరదాకి కూడా కొన్ని మాటలు అనకూడదని.. అన్నా సరదా శృతి మించకూడదని టైంలో మాకు తెలియలేదు...


రోజు ఆదివారం ... పండగ దగ్గర పడిందని ఇల్లు శుభ్రం చేస్తున్నాం .. సన్ సైడ్ మీద ఉన్న సామాను దింపుతూ బిపి డౌన్ అయ్యిందో లేక కాలు స్లిప్ అయిందో తెలియదు కాని మా అమ్మ ఒక్కసారిగా నిచ్చెన మీద నుండి దబ్బున కింద పడిపోయింది... తలకి పెద్ద దెబ్బ తగిలింది ... నా కళ్ళ ఎదురుగానే రక్తం, పడిపోయిన మా అమ్మ ... ఏడుస్తూ అమ్మని తీసుకుని మా నాన్న, నేను డాక్టర్ దగ్గరికి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ వెళ్లాను...


నాకు రోజూ మా అమ్మే అన్నం తినిపించేది... అప్పటివరకు నా చేతితో అన్నం తినే అలవాటు కూడా చేసుకోలేదు ... అంత గారం గా చూసుకునేది ... అలాంటిది మా అమ్మ హాస్పిటల్ లో పడి ఉంటే ఇంటిదగ్గర నా చేతితో నాకు అస్సలు అన్నం తినబుద్దేసికాదు......... నిద్రపట్టేది కాదు... పిన్నిని తీసుకు రా అనే మాట గుర్తొచ్చి ఎక్కడ ఆమాట నిజం అయిపోతుందేమో అని భయంతో వెక్కి వెక్కి ఏడ్చేసేదాన్ని..


అప్పుడు ఎన్ని దేవుళ్ళకి ఎన్నేసి మొక్కులు మొక్కుకున్ననో నాకే తెలియదు ... నా మొక్కులే ఫలించాయో లేక మా అమ్మ మంచితనం కాపాడిందో కానీ .... దేవుని దయ వల్ల మా అమ్మ సేఫ్... ఇది జరిగి ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది కాని భయం నా మనసులోనుండి ఇంకా పోలేదు... ఇప్పటికీ విషయం గుర్తొస్తే చెవులు రెండూ గట్టిగా మూసేసుకుంటా ... భయంతో...
పరమేశ్వరా! నిజంగా నువ్వంటూ ఉంటే నా వాళ్ళందరిని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా చూడు తండ్రీ .... వాళ్ళకి నువ్వు హాని చేసినా తట్టుకునే మానసిక స్థైర్యం నాకు మాత్రం లేదు ... నీకు అంతగా కావాలనిపిస్తే ఆల్టర్నేట్ గా నా ఆయుష్షు తీసేసుకో ...

--------------------------------------------------------------------------------------------------

(ఎనిమిది నెలలనుండి నా బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ రాయ మని ఎంత బుద్దిగా చెప్పిన వినడం లేదని చివరికి నాతో దెబ్బలాడి మరీ వేయించిన పోస్ట్ .... సామ ,దాన ,బేధ, దండో పాయలకి కూడా మాట వినకపోయేసరికి ఇంక థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పెట్టి నా చేత పోస్ట్ వేయించిన నా బెస్ట్ ఫ్రెండ్ కే ఈ క్రెడిట్ అంతా కే చెందుతుంది )