Wednesday, 10 November 2010

ఎర్రబస్ v/s నేను

ఎర్ర బస్......... ఆ పేరు లో వైబ్రేషన్స్ ఉన్నాయి..

బాగా సరదా పుట్టినోళ్ళో , కోపమొచ్చినోళ్ళో దీనిని పగలగొట్టిన తగల బెట్టినా నోరు మెదపకుండా ఎర్రి దానిలా చూస్తుందని "ఎర్రి బస్" అని పేరు పెట్టారంట ...కాల క్రమేణా నామాంతరం చెంది (ఈ పదం కోసం డిక్షనరీలు వెతక్కండి) ఎర్రబస్ గా స్థిరపడిపోయింది.

మహేంద్రసింగ్ ధోనీ వెనకాలో మహేష్ బాబు వెనకాలో పడే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు.??????

కాని ప్రతి అమ్మాయి ఈ ఎర్రబస్ లో స్థానం కోసం దాని వెనకాలే పడుతూనే ఉంటారు.....

మహేష్ బాబు మూడు సంవత్సరాలకో సినిమా తీసినట్టు రంజని ఆరు నెలలకో పోస్ట్ రాసినట్టుగా ఈ ఎర్రబస్ కూడా టైం punctuality లో ఆ పై ఇద్దరి విశిష్ట వ్యక్తులని ని క్రాస్ చేసి పడేసే అంత గొప్పది . అదే ఎవర్ గ్రీన్(red) .... ఎర్రబస్ గొప్పతనం.......

ఆ దిక్కుమాలిన వైబ్రేసన్స్ లో పడి ఇది ప్రాణాపాయ స్థితిలో ఉండగా దీనికి ఖుషి లో భూమిక లా ఓ "ఉగ్గు గిన్నెడు" రక్తం కూడా డొనేట్ చేసాను .దానితో (రూపాంతరం చెంది) అది ఎర్రగా బుర్రగా తయారయ్యి, ఎర్ర బస్ అయ్యింది... నా ఓర్పు సహనం దాని కి కూడా వచ్చేసాయి..

..చిన్నపటినుండే ఇలా ఈ ఎర్రబస్ మీద విపరీతమైన అభిమానం పెంచేసుకోవడానికి కారణం మా నాన్న చేతక్

మా నాన్న తన బైక్ ని తుడిచిపెట్టినందుకు రోజుకి రెండేసి రూపాయలు ఇస్తానంటే అశాశ్వత మైన డబ్బు మీద అత్యాశతో , బైక్ మీద ఎలాగూ రోజూ షికారులు చేయొచ్చు కదా అన్న దూరా(దురా)లోచన తో రోజూ అద్దం లా తుడిచిపెట్టేదాన్ని ..


అలా నా చిట్టి చిట్టి చేతులతో నేను చేసినా సేవలకి సరైన గుర్తింపు రాలేదు సరి కదా .......మా నాన్న ఇస్తానాన్న రెండేసి రూపాయలు కూడా నా ఎక్కౌంట్ కి ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదు.

వడ్డి తో సహా లెక్కేసుకుంటే వరల్డ్ బాంక్ కి కూడా అప్పిచ్చుకోవచ్చు...

డబ్బు మీద ఎలాగూ ఆశ వదిలేసుకున్నా ఇంకా ఈ పాడు మనసుకి మారు మూల ఎక్కడో బండి మీద ఆశ ఉండి చచ్చేది ...కాని బండి మీద షికారు కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అసలు మా బైక్ ని మా నాన్న దగ్గర ఉంచేవారు కాదు మా నాన్న ఫ్రెండ్స్ , చుట్టాలు... సరిగ్గా తుడవగానే తీసుకెళ్ళిన బండిని మరలా తుడిచే టైం వరకు తీసుకొచ్చేవారు కాదు.

తిరిగినంత సేపు తిరిగొచ్చి ఆ బండిని తుడుచుకోమని చెప్పి ఈ బాల కార్మికురాలి చేతిలో పెట్టెళ్ళిపోయేవారు.

ఊరికెళ్ళే టైం కన్నా బండి ఎక్కుదామని ఆశగా ,ఆనందం గా పరిగెత్తుకెళ్ళేసరికి నాకంటే ముందు లైన్ లో మా అమ్మ, మా చెల్లి ,ఓ రెండు మూడు బేగ్ లు ఉండేవి .. బేగ్ లు ఎదరపడేసి సీట్ ల్లో సెట్టిల్ అయ్యిపోయేవారందరు .. నన్ను మాత్రం మా నాన్న బండి కి జండా కర్రలా ఎదుర నిల బెట్టేవారు ..

ఆ బేగ్ ల మద్యన పీట వేసుకుని కూర్చుందమన్నా కాలి లేనంత ఇరుకు ..

మా చెల్లి సీట్ అస్సలు వదిలేది కాదు ..ఆఖరికి ...అఖరికి మా చెల్లి చేతిలో ఉన్న డప్పు కొట్టే కోతి బొమ్మకి కూడ ఓ గౌరవప్రదమైన సీట్ ఇచ్చేవారు...... మా కుటుంబ సభ్యులు

..కోతి బొమ్మ కిచ్చిన స్థానం కూడా నాకు లేదా????? కూతురు ఎక్కువా?? కోతి ఎక్కువా??అని గట్టిగా నిలదీసి అడుగుదామనిపించేది... కాని కోతే ఎక్కువ అని అంటారేమో అనే అనుమానంతో బిక్కమొహం వేసుకొని చూస్తు నిలబడేదాన్ని

స్కూలుకెళ్ళినప్పుడు మా నాన్న బైక్ మీద తీసుకెళ్ళేవారు.. అప్పుడు చక్కగా సీట్ లో కూర్చునే భాగ్యమయితే దక్కేది కాని. మా నాన్న ఒకరు రివ్వు రివ్వుమని స్పీడుగా దూసుకుపోవడమే తప్ప వెనకాల కూర్చున్నవారు ఉన్నారో , మద్య లోనే డ్రాప్ అయ్యిపోయారో అస్సలు పట్టించ్ కునేవారు కాదు ...

ఇలా బండి మీద నుండి పడి దెబ్బలు తినలేక ..అలా ఒంటి కాలు మీద కొంగలా నిలబడ లేక అమ్మమ్మ దగ్గరే ఉండిపోతానని పేచి పెట్టి వెళ్ళే దాన్ని కాదు....

రోజులు గిర్రున తిరుగుతున్నాయి ...నా స్థానం లో మాత్రం ఏ మార్పు చేర్పు లేకుండా అక్కడే పదిలమయిపోయింది

జన్మానికో శివ రాత్రిలా సంవత్సారానికో దీపావళిలా నా జీవితంలో అప్పుడప్పుడు బస్ ప్రవేశించేది.

అమ్మమ్మ , తాతయ్యల కూడా రాజమండ్రి బస్ మీద వెళ్ళే భాగ్యానికి ఓ మురిసిపోయేదాన్ని...బస్ ఎక్కేరోజున అంతా ఇంతా ఆనందం కాదు అంతరిక్ష నౌక ఎక్కుతున్నంత గొప్ప ఫీలింగ్ ..

బస్ వెలుతూ ఉంటే చెట్లు పరిగెడుతూ ఉంటే ఎంతో ఆనందం గా మిడిగుడ్లేసుకుని చూస్తూ కూర్చునేదాన్ని .. ఆ ఆనంధం ఎంతో సేపు నిలవనిచ్చేవాడు కాదు కండక్టర్ . పాపని తీసుకుని ఒడిలో కూర్చో పెట్టుకోండమ్మా అని అని నన్ను సీట్ లోంచి లేపేవరకు నిద్రపోయేవాడు కాదు సుత్తి కండక్టర్ ..

.ఈ కండక్టర్ అంకుల్ ఇంత చెడ్డ వాడని ముందే తెలుసేమో మా తాతయ్యకి... అందుకే 6 ఏళ్ళ పిల్లనయిన నాకు 3 ఏళ్ళు అని చెప్పి టికెట్ తీయకుండా సుత్తి కండక్టర్ తిక్క భలే తీర్చేవారు మా తాతయ్య

ఆలా బస్ తో ను బైక్ తో ను పని లేకుండా ఇంటర్ వరకు మూడో కంటికి తెలియ కుండా మా వూరి లోనే మహా గుట్టు గా చదువుకుంటున్న నాకు డిగ్రీ కి వచ్చేటప్పడకి కాలేజీ కి పక్క వూరెళ్ళాల్సి వచ్చింది …

పక్క వూరు అనగానే నాకు గుండెల్లో బైక్ లు పరిగెట్టడం మొదలు పెట్టాయి … రాత్రుల్లు అస్సలు నిద్ర పట్టేది కాదు పట్టినా ..మా నాన్న తన బైక్ మీదే కాలేజీ కి తీసుకెళుతున్నట్టు...

అప్పుడు కూడా నన్ను సీట్ లో కూర్చో నివ్వకుండా... బైక్ కి ఎదరే నిలబేట్టి తీసుకు వెళుతున్నాట్టు ఒకటే భయంకరమైన కలలు ...

ఈ టెన్సన్ కి బీపీ రాక ముందే మా నాన్న దగ్గరికి వెళ్ళీ డాడీ రేపటి నుండి కాలేజీకి ఎలా వెళ్ళను అని బాధతో కూడిన భయంతో అడిగాను .

ఎలా ఏమిటి వెళ్ళేది??? మీ ఫ్రెండ్స్ తో కలిపి బస్ లో వెలుదువు కాని అని అభయమిచ్చేసరికి ఎగిరిగంతేయ్యాలన్న ఆనందం వచ్చేసింది …దేవుడా నా ఆరాధన మెచ్చి నువ్వు ఇచ్చిన బస్సు ప్రసాదాన్ని సంతోసం గా స్వీకరిస్తాను తండ్రీ అని కళ్ళకద్దుకుందామనుకుంటే బస్ పెద్దగా ఉందని ఆగిపోయాను

house wash no festival అని తెలియక ... డాడీ చదువు కోసం మూడు వూర్లు దాటి వెళ్ళడమే కాదు మూడు చెరువుల నీళ్ళయినా తాగేస్తాను అని శపధం చేసేసాను....

ఆ సమయం లో ఓ భయంకరమైన నిజం బస్స్ లో తీరికగా నాకోసం ప్రయణం చేసి వస్తుందని నేనస్సలు వూహించలేదు..

కాలేజీ కి బయలుదేరిన మొదటి రోజు ... ముందుగా బస్సు లో కుడికాలా ??? ఎడమకాలా??? ఏది పెడితే బాగా కలిసొస్తుందో??? అని మా ఆరుగురు మాలో మేము ఓ డిస్కస్స్ చేసుకుంటుండగా బస్ వచ్చి ఆగింది ...

ఎక్కేటప్పుడు కండక్టర్, డ్రైవర్ ఎదురొచ్చి హారతి ఇచ్చి కుడికాలు ముందు పెట్టి రండమ్మా అని సాధరంగా ఆహ్వానిస్తాడేమో అని ఆర్తిగా ,ఆశగా విప్పారిన కళ్ళతో చూస్తూ నిలబడ్డమాకు నిరాశే ఎదురయ్యింది .

బస్ ఎక్కి పాస్ పోర్ట్ లు చూపించాము.... అప్పడివరకు శాంతిస్వరూప్ లా కనిపించే కండక్టర్ కాస్తా ఓంకార్ లా మారిపోయాడు....

పూనకం వచ్చినవాడిలా ఊగిపోతూ .......అరువు టికెట్ట్ లా ???ఇవేసుకుని పెళ్ళి కూతుళ్ళా నడుస్తూ వస్తే వచ్చే వరకు బస్ ఆపుచేసుకుని కూర్చుంటామనుకున్నారా.?????.

మీరు కాలేజి కి వెళ్ళక పోయినా ననష్టమేమీ లేదు మేము తొందరగ వెళ్ళకపోతే మా ఉద్యోగాలు ఊడతాయి అంటూ కయ్య్ మని పోతూ మా వంక కోపం గా బస్ పాస్ ల వంక చిరాకు గా అసహ్యం గా చూడడం మొదలుపెట్టాడు ...

మేమేమయినా అల్లాటప్ప వెంకాయమ్మల్లమా??? అష్ట లక్ష్మీ లకి ఆ ఇద్దరు లక్ష్మీ లే కదా తక్కువ ఆ మాత్రందానికి ఇంత చులకనగా చూస్తాడేమిటి ...

మమ్మల్ని అరువు టికెట్ లు అనడమే కాకుండా .శుభమా అని కాలేజీ కి వెళుతుంటె మంచి చెడ్ద లేకుండా వెళ్ళకపోయినా నష్టం లేదని శాపనార్ధాలేమిటో ఈ పెద్దమనిషి....

తెలుగింటి ఆడపడుచులకి కనీస మర్యాద ఇవ్వలేని ఆ పెద్దమనిషి తో గొడవ పడటం ఇష్టం లేక గొడవ పడే ధైర్యం లేక కిక్కురు మనకుండా చూస్తూఉండేవాళ్లం మంచిరోజుల కోసం

అలా మొదలయినియ్యి నా బస్సు కష్టాలు ..

Ambuja సిమెంట్ లో ఫెవికాల్ కలిపినంత దృడమైనా బంధం కావల్సిన నా బస్స్ భందం కాస్తా దినదిన గండమై నా పాలిట పాపమై నాకు తీరని శాపమై కూర్చుంది

మా మంద ని చూసేసరికి బస్ పాస్ లా????? ఎక్కొద్దు ..అరువు టికెట్ట్లు .... వెనకాల బస్ ఎక్కండమ్మా అనివెనకాల బస్ ని, ఆ వెనకాల బస్ వాడు ఇంకొక వెనకాల బస్ ని ఎంతో మర్యాదగా వినయం గా చూపెడుతూఉండేవారే తప్ప బస్ ఎక్కనిచ్చేవారు కాదు ....

ఒక వేళ మాట వినకుండా మొండిగా ఎక్కేస్తామేమో అని కండక్టర్ కర్ర పట్టుకుని కాళ్ళు విరగ్గొడతాను అనే లెవెల్లో గేట్ దగ్గరే నిలబడే వాడు,,,,

ఈ వెనకాల బండి ఎక్కాలని పాకులాడే కంటే.... కండక్టర్ చూడకుండా ఆ బస్స్ కి వెనకాల ఉన్న నిచ్చెనెక్కి న హేపీ గా వెళ్ళొచ్చు, బస్ పాస్ కూడా కలిసొస్తుంది అనిపించేది...కాని కండక్టర్ చేతిలో కర్రని చూసి అలాంటి సాహసాలు అస్సలు చెయ్యబుద్దేసేది కాదు ..

ఒక సారి ఏమయ్యిందంటే బస్స్ రష్ గా ఉంది . కండక్టర్ చూడకుండా గుంపులో గోవిందా అని ఎక్కేసాం ..సగం దూరం వెళ్ళేసరికి కండక్టర్ చూడడం మమ్మల్ని దింపేయడం కూడా చక చకా జరిగిపోయాయి .

రోజు ఎక్కితే ఎక్కారు కాని ఇంకెప్పుడు బస్ పాస్ లు పట్టుకుని బస్ లు మాత్రం ఎక్కకండి అని గాఠిగా వార్నింగ్ ఇచ్చాడు

ఆ క్షణం లో కండక్టర్ దింపినందుకు ఏడుపు రాలేదు .....మాకు మా ఓంకార్ కి లక్షా తొంభై గొడవలుంటాయి..... కాని బస్స్ లో ఉన్నవాళ్ళందరూ ఏదో అద్భుతాన్ని మిస్స్ అవుతామేమో అని తెగ టెన్సన్ పడిపోతు కిటికీళ్ళోంచి ఎగబడి చూడడం కనిపించని వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ లు పగల గొట్టి మరి చూసి పండగ చేసుకున్నారు ..

నిండు బస్సు లో జరిగిన ఆ ఘోర అవమానానికి ఒక్కసారి గా మా అర డజను హృదయాలు తీవ్రం గా తల్లడిల్లిపోయాయి

కంటి చూపుతో బస్సును తగలబెట్టేద్దామనుకున్న మాకు కన్నీటి తో వేడుకుంటున్నా దాని తింగరి మొహం చూసి జాలేసింది ... ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుందామని డిపో మేనేజర్ దగ్గరికి బయలుదేరాము...

MR డిపో మనేజర్ ..............కిందకి నువ్వొస్తావా?? పైకి మమ్మల్ని రమ్మంటావా(ఆఫీస్ అప్ స్టిర్ ) ? ??????????? బస్స్ పాస్ అంటే అంత చులకనా మీకు ??బస్స్ కాబట్టి మద్య లో దింపేసినా వెనక్కి నడిచొచ్చాము....

అదే పడవ అయితే ఇలాగే చేస్తారా?? .. పాస్ అని నడి గోదారి లో వదిలేస్తారా ? అని మాలో ఉన్న బాలకృష్ణ ఆరు సింహాలై గర్జించేసరికి డిపో మానేజర్ గడ గడ వణికిపోతూ ........ అలా ఇంకెప్పుడు జరగదని ప్రాధేయపడ్డాడు..

డిపో మానేజర్ పుణ్యమా అని అప్పడి నుండి మమ్మల్ని చూడగానే బస్స్ ఆగి మరి శాల్యూట్ చేసేది ...కాని కండక్టర్ మాత్రం Tit for Tat అంటే మీకే కాదు నాకు కూడ తెలుసన్న విషయం ప్రాక్టికల్ గా చూపించడం మొదలుపెట్టాడు

బస్ దొరక్క ఒక బాధయితే బస్ దొరికాక ఇంకొక భాధ ........డిగ్రీ కాలేజి దగ్గర ఆపుచేయమని అడిగితే కావాలని దూరం గా ఆపుచేసేవాడు కండక్టర్ ....బస్ పాస్ మీద కూడా డేట్స్ తప్పుగా పంచ్ చేసేసి సారీ చేప్పేసేసి చేతులు దులుపేసుకుని వాడు ..ఆ మర్నాటికి పని చేసేది కాదు బస్ పాస్... చచ్చినట్టు డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం ... యాక్సిడెంట్లని, ట్రాఫిక్ జాం , టైర్ పంచర్లని ఏ రోజు బస్స్ లోసుఖంగా వెళ్ళిన రోజే లేదు..

బస్ ఎక్కేటప్పడకి ఒక్క సీట్ ఖాలీగా ఉండేది కాదు ,....బస్స్ పడదండి కొంచెం విండో సీట్ ఇస్తారా అని అడిగితే కొందరు ఇచ్చేవారు కొందరు ఇచ్చేవారు కాదూ ...వీల్లందరూ గత జన్మలో రాజకీయ నాయకులై పుట్టి ఉంటారు సీట్లు వదలడం లేదు అనుకునే వాళ్ళం.... ఏది ఎమైనా సరే ఎంత రక్త పాతం జరిగినా సరే సారి కండక్టర్ మీదే కక్కేయాలన్నంత కోపం వచ్చేసేది ...

అర టికెట్ తీసుకున్నవాడిని కూడా ఆప్యాయం గా కంటికి రెప్పలా చూసుకునే కండక్టర్ ... .. అరువు టికెట్ అనే టప్పడకి ఎంత దారుణంగా చూసేవాడో........ పోనీలే నిలబడి ఉన్నారు కదా అని మాటవరసకి కూడా కూర్చోమని అనేవాడు కాదు ... పైగా డిపో మేనేజర్ కి కంప్లైంట్ ఇచ్చామన్నా పగొకొటి ...

పోనీ కండక్టర్ ఇంతేలే అనుకుంటే పెద్ద దిక్కు డ్రైవర్ కూడా మంచి చెడ్డ వివరించేవాడు కాదు.ఆ సుత్తి కండక్టర్కి

ఆకరికి డ్రైవర్ కూడా మమ్మల్ని చూసి లేచి సీట్ ఇచ్చేవాడు కాదు...

లేడీస్ సీట్ లైన్ లో ఉన్నా సీట్ లేడీస్ కోసం అని అని ఆ మాత్రం తెలియదా ఆ డ్రైవర్ కి ... అతిధి దేవో భవ అంటే ఆ ఇద్దరికిఅస్సలు తెలియదు ..

మర్యాద లేని చోట అస్సలు కూర్చోబుద్ది కాక కూర్చోవడానికి సీట్ కూడా లేక అలా తిప్పలు పడుతూనే వుండేవాళ్ళం ..... బస్ పడి చావక తాగిన మూడు చెరువుల నీళ్ళూ కక్కేసేదాన్ని ..


బస్ లో సీట్ సాధించడం కోసం ఎన్నో రిఫరెన్స్ బుక్ లు చదివాము ..ఎన్నో కోచింగ్ లు తీసు కున్నాము.... కాని సీట్ మాత్రం సాధించలేకపోయాము...

కోచింగ్ ల తో పని జరిగేలా లేదని నా సొంత తెలివితేటలతో సమస్య కి పరిష్కారం కనిపెట్టాలని ఒక రోజంతా ఆలోచించి కత్తి లాంటి అయిడియా కనిపెట్టాను ..

దేవుడా .... ఈ పాపిని క్షమించు..... శిక్షించకు .

జై బాలకృష్ణ!!!!!! అని అని కనిపించిన వాళ్ల కాళ్లని నా హీల్స్ తో కసా పిసా తొక్కేసేదాన్ని.... ఈ పిల్ల కాళ్ళు తొక్కేస్తుంది బాబోయ్ అని దెబ్బకి గొల్లు గొల్లు మంటూ లేచి సీట్ ఇచ్చేవారు .

శివా!!! నీకు ఎన్ని తెలివి తేటలే!!!! నీ బుర్రని కొంచెం సార్ప్ చేసావంటే ఈ సీట్ ఏమి కర్మ CM సీట్ కూడా ఈజీ గా కొట్టెయొచ్చు అని నాలో నేను మురిసిపోతూ

రేపు సి ఎం ని అయ్యాకా చిరాకు గా, ఛీప్ గా ఇలా A.C కారుల్లో వెళ్ళను... చక్కగా నేనొక ఎర్రబస్ లో వెలుతుంటే నా వెనకాల ఓ పదో ఇరవయ్యో ఎర్ర బస్స్ లు పాలో అవుతుంటే........ నా సామి రంగా .....ఆ కళే వేరు.....ఆ అనుభూతే వేరు అని ఊహల్లో తేలిపోతూ ఉండగా

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు ఈ లోపు మా ఫ్రెండ్ కసుక్కున తొక్కేసేది నాకాలు .....ఒసేయ్ మిత్రద్రోహి ... ఇదన్యయామే........అని ఏడుపు మొహం పెడితే... సారీ శివా నిలబడడానికి ప్లేస్ లేదు కదే.... చూసుకోలేదే.... అని బేగ్ లు ఈ రికార్డ్ లు పట్టుకోమని చెప్పి మిగతా అయిదుగురు పొలో మని నా ఒడిలో పడేసే వారందరూ......ఆ బేగ్ ల్లో ఉన్నా బాక్స్ ల్లో చారులు ,పెరుగులకి నా బట్టలు బలైపోయేవి . .. ఇలాంటి దిక్కుమాలిన అయిడియాలు కనిపెట్టిన నా బుర్ర మీద నాకే అసహ్యమేసేది ....


అబ్బబ్బ ఎన్ని కష్టాలో!!!!!!! అలా బస్ చూరు పట్టుకుని గబ్బిలాల్ల వెళ్లాడడమే సరిపోయింది మూడు సంవత్సరాలు...

ఇప్పుడు బస్స్ పాస్ పీడ అయితే వదిలింది కాని...
ఇప్పడికికండక్టర్, బస్స్ మాత్రం నిన్ను వదలా బొమ్మాలి అంటూ హింసిస్తూనే ఉన్నాయి ..

.కండక్టర్, ఇవ్వాల్సిన చిల్లరి ఇవ్వకుండా ఎగ్గొట్టేయడం ...దిగిన వాళ్లలో పక్కవాళ్ళకి ఇచ్చానని నాకు . నాకిచ్చాను అని పక్కవాళ్ళకి చెప్పి ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టేయడం ...

అదేమిటో నాకెప్పుడు రెండు రూపాయిలు చిల్లర ఇవ్వాల్సినప్పుడు బాగా గుర్తుపెట్టుకుని అడుగుతానా కండక్టర్ ని ...లేవు పొమ్మంటాడు నిర్మొహమాటంగా.........

కాని వందో , యాభయికో చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం చక్కగా మర్చిపోయి బుద్దిగా గంగిరెద్దులా దిగేయడం ..వెళ్ళాకా లబో దిబో మనడం.....ప్చ్... నన్నిలా ఎన్నిసార్లు బురిడీ కొట్టించారో తెలియదు ...

ఒకటా, రెండా "బస్సు"డు కష్టాలు నేను మొయ్యలేను కాక మొయ్యలేను .... అందుకే ఇంకో కత్తి లాంటి నిర్ణయం తీసుకున్నాను ..

మా ఊరిలోను మార్గదర్శి ఉంది

రేపో , నిన్నో......... నేనూ మార్గదర్శి లో చేరతాను ...ఎంచక్క రైలో, స్టీమరో కొనుక్కుంటాను

70 comments:

Ramakrishna Reddy Kotla said...

హ హ బాగున్నాయి ఎర్ర బస్సు కబుర్లు ... నేను ఇంజినీరింగ్ చదివేప్పుడు కూడా రోజూ రాజమండ్రి నుండి కాలేజీ కి వెళ్ళడానికి ఎర్ర బస్సు ఎక్కు పాస్ చూపించేవాళ్ళం... పాపం అప్పుడు కండక్టర్ ముఖం చూడాలి, భలే ముచ్చటగా ఉంటుంది :-))... ఒక రోజైతే బస్సు మొత్తం అరువు టిక్కేట్లే :-))... చాలా హ్యుమరాస్ గా రాసావు రంజనీ.. ఇలా నువ్వు మొత్తం రాసేస్తుంటే ఇక నేను రాయడానికి ఏముంటాయి చెప్పు ;-)... పోరాగా కోరగా ఇన్ని రోజులకి రాసావు టపా ...చాలా హ్యాపీ నేను :-).. ప్రతి లైన్ లో కూడా మంచి హ్యుమర్ తో రాసావు ... చాల సేపు నవ్వుకున్నాను :-))

మనసు పలికే said...

అయ్యయ్యో శివా ఎప్పుడు పెట్టేశావ్ పోస్ట్..? నేను చూడనే లేదు.. చదివి మళ్లీ వ్యాఖ్య పెడతా..:)

మనసు పలికే said...

హహ్హహ్హహ్హా.. భలే రాసావు రంజని..:)
>>ఆకరికి డ్రైవర్ కూడా మమ్మల్ని చూసి లేచి సీట్ ఇచ్చేవాడు కాదు...
ఏంటమ్మా డరివర్ సీట్ కూడా కావాలా నీకు..:)))
>>రేపు సి ఎం ని అయ్యాకా చిరాకు గా, ఛీప్ గా ఇలా ఆ.ఛ్ కారుల్లో వెళ్ళను... చక్కగా నేనొక ఎర్రబస్ లో వెలుతుంటే నా వెనకాల ఓ పదో ఇరవయ్యో ఎర్ర బస్స్ లు పాలో అవుతుంటే........ నా సామి రంగా .....ఆ కళే వేరు.....ఆ అనుభూతే వేరు అని ఊహల్లో తేలిపోతూ ఉండగా
అసలు సి.ఎం. అయ్యాక కూడా ఎర్రబస్సే కావాలి అన్నావు చూడు, నువ్వసలు కేక రంజనీ..
>>రేపో , నిన్నో......... నేనూ మార్గదర్శి లో చేరతాను ...ఎంచక్క రైలో, స్టీమరో కొనుక్కుంటాను.
:))))
మొత్తానికి అడగ్గా అడగ్గా మంచి టపాతో మమ్మల్ని పలకరించావు..:) చాలా బాగుంది..:)

జయ said...

నీకు నేను బస్ లో సీట్ ఇచ్చినప్పుడల్లా, ఎన్ని సార్లు చెప్పాను, ఓ బస్ కొనుక్కో శివానీ అని....విన్నావా...విన్లేదు. ఎందుకింటావ్, నా మాట వినుంటే ఆ డ్రైవర్ని చేతులుకట్టుకొని నించో పెట్టి మరీ డ్రైవింగ్ చేయించే దానివి కదా. ఆ కండక్టర్నేమో మధ్యలో దింపేసి కసి తీర్చేసుకునే దానివి కదా. అన్నేసి కష్టాలు దెబ్బకి పారిపోయేవి కదా ఈ ఫ్యూచర్ సి.ఎం. ముందు.

ఇందు said...
This comment has been removed by the author.
ఇందు said...

శివరంజని గారు లేట్ గా వ్రాసినా సూపర్ గా వ్రాసారు పోస్ట్.నాకైతే మా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి.మేము కాలేజీ బస్సులొనే చాల కష్టాలు పడితే మీరు ఎర్ర బస్సులో మాకంటే ఎక్కువే పడ్దారు.మీ సెన్స్ ఆఫ్ హ్యుమర్ మాత్రం అదుర్స్
>>కోతి బొమ్మ కిచ్చిన స్థానం కూడా నాకు లేదా????? కూతురు ఎక్కువా?? కోతి ఎక్కువా??అని గట్టిగా నిలదీసి అడుగుదామనిపించేది...

హ్హహ్హహ్హ !

>>బస్ ఎక్కి పాస్ పోర్ట్ లు చూపించాము.... అప్పడివరకు శాంతిస్వరూప్ లా కనిపించే కండక్టర్ కాస్తా ఓంకార్ లా మారిపోయాడు....

ఓంకార్ మహాశయుడిని కూడా ఎర్రబస్సు ఎక్కించేసారుగా!!

>>ఆకరికి డ్రైవర్ కూడా మమ్మల్ని చూసి లేచి సీట్ ఇచ్చేవాడు కాదు...

మాకు సీట్లు దొరకనప్పుడు సేం నేను ఇంతే అనుకునేదాన్ని :D

నేను బ్లాగ్ మొదలుపెట్టాక మీరు వ్రాసిన మొదటి టపా! బాగ వ్రాసే వాళ్ళు కూడా ఇలా ఆరునెలలకి ఒకసారి వ్రాస్తే ఎలా అండీ! కనీసం నెలకి ఒకసారి అయినా ట్రై చేయండీ :)

karthik said...

అసలు మీకు ఈ విషయం తెలుసా:
APSRTC: ఆగితే పోదు సమయానికి రాదు టయానికి చేరదు :P

హరే కృష్ణ said...

చాలా....బావుంది శివ రంజని
కాకపొతే లెంగ్త్ నే కొంచెం...........తక్కువనిపించింది
ఈ సారి నుండి ఇంకాస్త పెద్ద టపాలతో రావాలని కోరుకుంటూ..వందో కామెంట్ చేసినప్పుడు మళ్ళీ కామెంట్ పెడతానని మనవి చేసుకుంటున్నా

వేణూరాం said...

శివరంజనీ గారూ... టపా రచ్చ రచ్చ.. సూపర్ గా ఉంది..
బస్ పాస్ లతో స్టుడెంట్స్ అందరికీ ఇవే ఇక్కట్లు కదా.! పంచ్‌లు అదిరాయి :)
"బస్ ఎక్కి పాస్ పోర్ట్ లు చూపించాము...." కెవ్వ్వ్....
ప్రతి పేరాకీ పిచ్చెక్కించారు.. కాస్త రెగ్యులర్ గా రాయండి మరి..:)

మంచు said...

:-))

వేణూ శ్రీకాంత్ said...

హ హ శివరంజని గారు ఫస్ట్ లైన్ కే సిక్సర్ :) పాపం అష్టా చెమ్మా దర్శకుడు :) మీ కష్టాలు చెప్తున్నారు కానీ అదేంటో నాకైతే నవ్వుఆగలేదు :) ఇంత శాడిస్ట్ ని ఎపుడయ్యానా అని ఆశ్చర్య పోయా. టపా చాలా బాగుంది.

కొత్త పాళీ said...

బాగున్నై, ఎర్రబస్సు కష్టాలు, కలలు

అశోక్ పాపాయి said...

హాస్య రంజని గారు! నిజంగా హాస్యం పండించడం కత్తి మీద సామే కాస్త గతి తప్పిన హాస్యం కాస్త అపహస్యం అవుతుందండీ. అది వ్యంగప్రధానమైతే మరింత ఒళ్లు దగ్గర పెట్టుకు రాయడం అవసరం .లేకపోతే పాఠకుల ఆగ్రహాన్ని కూడ చవి చూడాల్సి రావచ్చు. ఈ సాధక బాధకాలని తట్టుకుంటు మీ బ్లాగులో తడబాటు లేకుండ హాస్యన్ని పండిస్తూనే ఉన్నారండీ. మీ బ్లాగ్ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా మళ్లి మళ్లి కోరుకుంటూ.

శిశిర said...

బాగున్నాయి మీ ఎర్రబస్సు కబుర్లు. నాకు కూడా ఏడేళ్ళ అనుబంధం మన ఎర్రబస్సుతో. విరక్తొచ్చేసి ఇప్పుడు ఎర్రబస్సు ఎక్కడం మానేశా. :)మీరు ఎర్రబస్సుకి చెప్పిన డెఫినిషన్ బాగుంది. :) అదొక్కటేమిటి, టపా అంతా చాలా బాగుంది. సరదాగా చెప్తూనే ఆ కష్టాలన్నీ కళ్ళకి కట్టారు.

3g said...

హ్హ హ్హా...... మీ ఎర్రబస్సు ఖష్టాలు సూపర్...ఏంసూపరని అడక్కండి...నేను మళ్ళీ మీపోస్టంతా కాపి పేస్ట్ చెయ్యాలి.

ఎర్రిబస్సుతో నావికూడా సేంఖష్టాలు.... కాని ఒకళ్ళిద్దరు కండక్టర్లు తప్ప మిగతావాళ్ళు ఏమనేవారు కాదు. నవ్వుతూ తిట్టుకొనేవాళ్ళు బస్సు ఫుల్లు కలెక్షన్ నిల్లు అని.

మాలా కుమార్ said...

శివా ,
నీ ఎర్రబస్ కహానీ బాగుందమ్మాయ్ .
ఈ కార్తీక మాసమంతా ఇలాగే టపాలు రాస్తూ వున్నావనుకో , నవ్వుకుంటూ , శివ శివా అని కామెంట్స్ పెట్టాననుకో , శివ నామ స్మరణ తో పునీతురాలనవుతాను కదా !

శివరంజని said...

@కిషన్ గారు: మీరు కాలేజీ కి బస్స్ లో వెళ్ళే వార? నేనింకా మీ హాస్టల్ కాలేజీ దగ్గరేమో అనుకున్నా ...అయితే ఈ బస్స్ కష్టాలు మీకు తెలుసన్నమాట ... నిజమే రాయాలంటే బద్దకం, లాపీ లేకపోవడం ఈ కారణాల వల్ల రాయలేకపోతున్నాను .. చాలా రోజులయ్యింది కదా అని ఈ పోస్ట్ కూడా హడావిడిగా రాసేసా

@ఆపర్ణ :బస్స్ కష్టాలు నీకు తెలియదనుకుంటా నువ్వు చాలా లక్కీ ... నీ కామెంట్ కి పడిపోయా ...పూర్తిగా పడిపోయా

@జయ గారు: నిజమే మీ మాట వినుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు .... అందుకే మీరు చెప్పినట్టు బస్స్ కాకపోయినా కనీసం ఓ రైలన్నా కొనుక్కుందాము అనుకుంటున్నా

శివరంజని said...

@ఇందు గారు: నా పోస్ట్ రెగ్యులర్ గా ఫా?లో అవుతున్నందుకు ధన్యవాదములు... మీ కాలేజీ బస్ ఇంత దారుణం గా ఉండేది కాదేమోలేండీ .......తప్పకుండా రెగ్యులర్ గా రాస్తానండి మీ కాంప్లిమెంట్ లాంటి కామెంట్ కి ధన్యవాదములు .....నచ్చినవి కోట్ చేసినందుకు చాలా హేపీ గా ఉంది..

@కార్తీక్ గారు: ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతం .... హహహహ మీరు చెప్పిన డైలాగ్ కేక

@హరే కృష్ణ గారు: >>>>>>>>కాకపొతే లెంగ్త్ నే కొంచెం...........తక్కువనిపించింది<<<<<<<
100% correct లెంగ్త్ బాగా ఎక్కువయ్యింది కదా... పోస్త్ రాసేటప్పుడే ఎందుకో బాగోలేదనిపించింది ...కాని షార్ట్ చెయడం ఎలాగో తెలియలేదు ...

శివరంజని said...

@వేణురాం గారు: Thank you, thank You , Thank you ... తప్పకుండా రెగ్యులర్ గా రాస్తానండి

@మంచు గారు : పోస్ట్ బాగా బోర్ కొట్టిందా ??? హడావిడి గా రాసిన పోస్ట్ లేండీ

@వేణు శ్రీకాంత్ గారు" మీ కామెంట్ లో ఆ చివ్వరి లైన్ సూపరో సూపరు ... థాంక్సండి నా బ్లాగ్ సుత్తి ని ఓపికగా చదివినందుకు

@కొత్త పాళీ గారు: ధన్యవాదములండి

Bulusu Subrahmanyam said...

ఇంత పెద్ద టపాని ఎక్కడ ఆపకుండా చదివించేసారు, ఇంకో రెండు పేజీలు ఉంటే బాగుండేదేమో ననిపించింది. చాలాబాగుంది అన్నాunder statement అనిపిస్తుంది.
హడావడిగా రాస్తేనే ఇంత బాగుంది, తీరుబడిగా రాస్తే ఇంకెంత బాగుంటుందో.
మీరు రైలు కొనుక్కున్నప్పుడు మాకు ఫ్రీ సీట్లేనా?
థాంక్యూ ఫర్ ఎ నైస్ పొస్ట్.

ఆ.సౌమ్య said...

బావుంది కానీ కాస్త పస తగ్గింది. మునుపు టపాలంత పండలేదు. కొన్ని చెణుకులు మాత్రం అదిరాయిలే.

శివరంజని said...

@అశోక్ గారు: Thank you, thank You , Thank you మీ కామెంట్స్ ఎప్పుడూ నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

@శిశిర గారు: ఎర్రబస్స్ తో ఏడేళ్ళ బంధమా మీది హహహహ అయితే మీది జన్మ జన్మల భంధం అయ్యి ఉంటుంది సుమీ
@మాలా కుమార్ గారు : అంతేనంటారా ? నా బ్లాగ్ లో పుణ్యం దొరుకుతుందంటే తప్పకుండా రాస్తానండి

@3Gగారు: కష్టాలెక్కడయినా సూపర్ గా ఉంటాయండీ ...కష్టం గా ఉంటాయి కాని ...అయితే ఈ ఎర్రబస్ కష్టాలు మీకు కూడా ఉన్నాయన్నమాట ... మాకు కూడా కండక్టర్లు ఒకరిద్దరే అలా ఉండేవారు మిగతా అందరూ మంచిగానే ఉండేవారు ...కాని ఆ ఒకరిద్దరు చాలు కదండీ కష్టపెట్టడానికి

@

శివరంజని said...

@Bulusu Subrahmanyam గారు : ముందు గా నా బ్లాగ్ కి సుస్వాగతం ..మిమ్మల్ని ఇంతగా మెప్పించినందుకు నా జన్మ ధన్యమయిపోయింది .. ఇంకో రెండు పేజీలు ఉంటే ఎవ్వరు చదవకపోదు రేమోనండీ .....రైలంతా ఖాళీనే కదా మీ అందరికి ఫ్రీ సీట్లే

@సౌమ్య గారు :మీరు చెప్పింది 100% కరెక్ట్..నేను ఏకిభవిస్తున్నాను మీతో ... పోస్ట్ వేసేటప్పుడు నాకు అనిపించింది . మూడు రోజులనుండి టైప్ చేస్తున్నా గంట గంట కి పవర్ కట్ అవ్వడం వల్ల మూడ్ కాస్తా పాడయిపోయింది .

మంచు said...

శివరంజని - ఆ స్మైలీ కామెంట్ పెట్టే సమయానికి నేను పొస్ట్ ఇంకా చదవలేదు... ఆందరూ కామెంట్స్ పెట్టేస్తున్నారని ...నేనూ త్వరగా అంటెండెన్స్ వేయించుకొవడానికి పెట్టిన కామెంట్ అది :-)

ఇప్పుడే చదివాలే....

"ఆ పేరు లో వైబ్రేషన్స్ ఉన్నాయి.." ఇది సినిమా డైలాగా.... నేనూ ఎదొ అర్ధం చేసుకున్నా :D

మీ నాన్నగారి డ్రైవింగ్ గురించి చదువుతుంటే ఇది గుర్తువచ్చింది
http://www.telugucartoons.com/i/telugu-cartoon-mallik-226.gif

ఆ కండక్టర్ చిన్నప్పుడు రాజమండ్రి పుష్కరల్లొ తప్పిపొయిన యశొదా ఆంటీ తమ్ముడు అంట ..అందుకే పొలికలు :D

ఆఖరికి డ్రైవర్ కూడా మమ్మల్ని చూసి లేచి సీట్ ఇచ్చేవాడు కాదు... కెవ్వ్వ్

ఒకే... ఎర్ర రైలొ , ఎర్ర స్టీమరొ త్వరగా ప్రాప్తిరస్తూ

మంచు said...

నీ బ్లాగ్ టెంప్లెట్ కాలం వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ స్క్రోల్ చెయ్యాల్సి వచ్చి పొస్ట్ ఎక్కువ లెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం వెడల్పు పెంచి (జాజిపూలు బ్లాగ్ లాగ) లైన్ కి 55-60 అక్షరాలు వచ్చేలా మారిస్తే బావుంటుంది.
అలాగే లెంత్ ఎక్కువ అనిపిస్తే....రెండు బాగాలుగా విడగొట్టానికి ట్రై చెయ్యి.... అప్పుడు నీకు ఎక్కువ పొస్ట్లు ...మేము ఏది మిస్స్ అవ్వం ...

భాస్కర రామి రెడ్డి said...

LOL lol looooool

ఇంకా మిగతావి ఏమన్నా వుంటే అవీను :)

Rishi said...

చాలా బాగుంది. చదువుతున్నంత సేపూ ఈ లైన్ బాగుంది అనుకుంటుంటే వెంటనే దానిని తలదన్నే ఉపమానమో ఉదాహరణో వాడి మొత్తం టపా అంతా బాగుంది అనేటట్లు రాసారు.
దీనిని పైన ఉంచండి అనగా Keep it up అని...

శేషేంద్ర సాయి said...

టపా సూపరండి :)
డ్రయివర్ సీట్ ఇవ్వకపోవటం, కాళ్ళు తొక్కెయటాలు హ హ :)

బస్ పాస్లు అంటే కండక్టర్లకి చాల చులకన. మేము మూడు సంవత్సరాలు అనుభవించాం ఇలా కష్టాలు :(

వైదేహి said...

ఎంత వోపికగా మీ అనుభవాలు రాసారండీ.
బాగుంది.

మధురవాణి said...

చాలా చాలా చాలా.. ఎంతో ఎంతో బాగుంది పోస్టు. చాలా నవ్వించేశారు ..మీ స్టైల్లో! తరచూ రాయాలి మేడం మీరు..నేను కూడా ఓ ఏడాది అప్పుడప్పుడూ కొన్ని నెలలు ఇలా ఎర్రబస్లో వెళ్లాను స్కూలుకి. కానీ, అప్పట్లో బస్ పాస్ వాళ్ళని ఇలా ఏం హింసించలేదు. పాపం మా ఊరు రూట్లో బస్ కండక్టర్లు మంచోళ్ళేమో మరి! :)

Anonymous said...

chala baagaa rasaaru andi ....

..Raja

సీత said...

toooooooooo much undi!

నేస్తం said...

ఈ పొస్ట్ ఇంతకు ముందు చదివాను..కాని కామెంట్ ఎందుకు రాయలేదబ్బా??? రాద్దాం అనుకుని, కాసేపటికి రాసేసా అనుకొని, రాయలేదనుకుంటా ..పోస్ట్ సూపరోయ్

Sai Praveen said...

అయ్యో...ఈ పోస్ట్ నేను ఇంతకు ముందు చదివినప్పుడు కామెంట్ రాయలేదా?
చాల బావుంది రంజని. నీ పంచ్ డైలాగులు ఎప్పటి లాగే సూపర్.
చిన్నప్పుడు నాకు బస్సెక్కితే ఆ వాసనకి కడుపులో తిప్పేసేది. కాబట్టి నేను ప్రయాణం అంటే ఎప్పుడు రైలే ఎక్కుదాం బస్సు వద్దంటే వద్దు అని గొడవ చేసేవాడిని. కానీ బస్ మీద ఇంత అభిమానం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట :)

kiran said...

:D..ma college days anni gurthochayi..chala bagundi post...ee train oo konnaka oka post pettandi..meeku work out aithe..nenu kuda marga darsi lo cherutha.. :D

Sasidhar Anne said...

Wow.. One more excellent blog.. Munduga Thanks to sisira garu, Thana blog lo nunche mee blog gurinchi telusu kunna..
Morning chadavatam start chesi.. Idhigo ippudu anni posts chadivaka comment peduthunna.. oka pakka work and inko pakka mee blog.. Ivvala motham mind relax ga vundi ante nammandi.

me way of writing gurinchi andharu antha pogidesaru..valla pogadthalu anni correct. Baga navvincharu.. assalu aa posts rasthunnappudu meeku kottha kottha thoughts ela vasthayi chepma..

అశోక్ పాపాయి said...

శివరంజని గారు మీకు బోల్డు థాంక్యులు...:)) మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మీరు మమ్మల్ని ఎప్పుడు ఈలాగే నవ్వించాలని మీబ్లాగ్ మరింత ముందుకు తీసుకపోవాలని నేను కూడ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

3g said...

శివరంజని గారు మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మరియు నా ప్రతిశుభాకాంక్షలు.
మధుర గారు చేసిన ఇ-పుస్తకంలో మీ పోస్ట్ బావుంది.

sivaprasad said...

Siva ranjani గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, thanks alot ..and wish u da same

జయ said...

హయ్ సెంచురీల శివాని, ఈ ఎర్రబస్ లో ఇంకా ఎంతకాలం . మరి నూతన సంవత్సర శుభాకాంక్షలందుకొ. చక్కటి పోస్ట్ తో ఇంకేదైనా కొత్త బండిలో మమ్మల్ని ఊరేగించేది ఎప్పుడంట.

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

మాలా కుమార్ said...

happy new year

శిశిర said...

శివరంజనీ,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Nagaraju said...

Hi,

Plz circulate this mail for Telugu Book Readers

New book realease (Naa Baavanaalochana) Jan 2011

It Contains Universal knowledge with so many thoughts

For Contact : 9741005713

Thanks,
Nagaraju G

నీహారిక said...

సంక్రాంతి శుభాకాంక్షలు బంగారం.

అశోక్ పాపాయి said...

శివరంజని గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభా కాంక్షలు..))

SRRao said...

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

సీత said...

Kotta post eppudu raastav ammai??

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ టపా చూసి చాలా కాలమైంది, అనుకొని ఇక్కడకు వచ్చాను. ఏమైనా మిస్ ఆయానేమో నని.

నాదే ఏభై వ కామెంటు.
హాహాహాహ్హ.
మరి next టపా ఎప్పుడు.

Vamsi Maddipati said...

హాయ్ శివరంజని గారు,

నేనెన్నో బ్లాగులు చూసాను, పోస్టులు చదివాను...కాని ఇంత హ్యూమరస్ గా ప్రజెంట్ చేసినవాళ్ళను చూడలేదు.....

నా కాలేజి రోజులన్ని గుర్తుకు వచ్చాయి.....మీ కాప్షన్ కూడా చాలా బాగుంది.
"వెన్నెల - వర్షం............ మా ఊరు - గోదావరి......... పువ్వులూ - పసిపాపల నవ్వులూ.... లంగా ఓణీలు-మువ్వల పట్టీలు.. ఇవే ప్రపంచంగా పెరుగుతున్న ఒక మాములు పల్లెటూరి గోదావరి అమ్మాయిని"

శివరంజని said...

@సుబ్రహ్మణ్యం గారు: Thank you , Thank you ,Thank you ,
ఈ మద్య బ్లాగ్ మీద అశ్రద్ద వల్ల నో లేక వర్క్ బిజీ నో తెలియదు కాని చాలా లేట్ చేసానండీ ... తప్పకుండా రాస్తాను కొత్త పోస్ట్........

నా బ్లాగ్ గుర్తు పెట్టుకుని వచ్చినందుకు బోలెడు థాంక్స్లు ..అలాగే 50 వ కామెంట్ చేసినందుకు కూడా

శివరంజని said...

@ వంశి గారు ఉదయాన్నే మీ కామెంట్ చూసి నేను చాలా చాలా చాలా హేపీ ఫీల్ అయ్యాను :):):)

కాలేజీ రోజులన్నీ ఇంచుమించు గా అందరికి ఒకే లా ఉంటాయేమో ...

కాప్షన్ బాగుందంటారా ...నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ :)

SHANKAR.S said...

ఇదే ఫస్ట్ టైం మీ బ్లాగు చూడటం. గోదారి నీళ్ళలో ఉండే సహజమైన కామెడీ మీకు బానే అబ్బింది. దీన్ని పైనే ఉంచండి. (keep it up కి తెలుగు అనువాదం). కుసింత వెటకారం, కుసింత మమకారం కలిస్తే గోదారోళ్ళు..అదేటండి అలా చూస్తారు, అర్ధం కాలేదా? ఆయ్..మాది కాకినాడండి. (మిమ్మల్ని పొగిడినట్టు కలరిచ్చి హోలు మొత్తం గోదావరి జిల్లాల వాళ్ళని మోసేసానన్నమాట :)

శివరంజని said...

హహహ శంకర్ గారు మీ కామెంట్ చూసి చాలా ముచ్చటేసింది . గోదావరి వారికి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా బాగుంది .......మీ అభిమానానికి ధన్యవాధములు ... మీది కాకినాడ అండి మేము కోనసీమ లోకి వస్తాము లేండి

SHANKAR.S said...

అంటే మరేమోనేమో నేను పుట్టింది కాకినాడండి. మా నాన్నారు, అమ్మగారు, తాతారు (ఇరు వైపులా) పుట్టిందేమో అచ్చమైన కోనసీమండి. మన అంబాజీ పేట లేదండీ దాన్దగ్గరన్నమాటండి..ఆయ్

సుమలత said...

మీ బ్లాగు చూడడం ఫస్ట్ టైం అండి చాలా బాగా రాసారు
శంకర్ గారు చెప్పినట్టు కుసింత వెటకారం,కుసింత మమకారం కలిస్తే గోదారోళ్ళు..అదేటండి నాకు చాలా
అభిమానం నేను ఇందులో శంకర్ గారి తో ఏకీభవిస్తున్నాను.

జయ said...

హాయ్ శివానీ, అలా మాయమైపోతే ఎలా? నీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

శివరంజని said...

హాయ్ జయ గారు మీకు కూడ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు....
మొన్న మా ఆఫీస్ లో ఒకావిడకి విష్ చేస్తే నీకెందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు... నవంబర్ 14 వస్తుంది పోయి అప్పుడు చేసుకో పండగ అని చెప్పి నన్ను హర్ట్ చేసింది ఆవిడ ...మహిళా దినోత్సవం రోజున సాటి మహిళకి జరిగిన అవమానానికి జీర్ణించుకోలేక ... అందుకే ఎవరికి విషెష్ చెప్పలేదు ....

జయ గారు నేనెక్కడికి మాయమవ్వలేదు ... దొంగా పోలిస్ ఆడుతున్నా నేను దాక్కుంటాను మీరు కనిపెట్టాలి అన్నమాట :) త్వరలో రాస్తానండి పోస్ట్ ... కాకపోతే నాకు బద్దకం బ్లాగ్ లోకి రావాలంటే

డేవిడ్ said...

శివ గారు బాగుంది మీ పొస్టు....

Sasidhar Anne said...

Sivaranjani.. Inka ee bus , shed ki vellaleda.. twaraga pampinchi kottha post raayi :)

kallurisailabala said...

me blog eppude chusanu...Anni chadivi marosari coments post chestanu...
http://kallurisailabala.blogspot.com

Vamsi Maddipati said...

శివ రంజని గారు,

మీ పోస్ట్ కోసం ఎదురుచూసి చూసి చూసి కళ్ళు కాయలు కాసి పళ్ళైపోతున్నాయి. కాసింత ఫాస్టుగా రాస్తే ... కూసింత స్లోగా మేము నవ్వుకుంటాము ( గట్టిగా నవ్వితే మా బాసు క్లాసు పీకాడు)

గోదారమ్మాయిలు గురించి ఏదైన పోస్టు రాస్తే నాకు కాబోయే శ్రీమతికి గిఫ్టుగా ఇచ్చి మార్కులు కొట్టేస్తా..
(నాకు కాబోయే శ్రీమతి గోదావరమ్మాయి)

శివరంజని said...

డేవిడ్ గారు , శైల గారు , శశిధర్ గారు , వంశీ గారు ధన్యవాదములు అండి ...

హహహః వంశీ గారు మీ కాబోయే శ్రీమతి గారు గోదావరి వారా ??? ..గోదావరి అమ్మాయిలకి అమాయకత్వంతో కూడినా తెలివితేటలు ....... ముందుగా మీకు కంగ్రాట్స్ .... మీ అభిమానానికి కృతజ్ఞురాలిని .... పైన కామెంట్ పెట్టిన శశిధర్ గారు పెళ్ళికి ముందు కామెంట్ పెట్టారు ...ఇప్పుడు తన పెళ్లి అయిపొయింది కాని నేను పోస్ట్ రాయలేకపోయాను ...సో మీ పెళ్ళికి ముందే పోస్ట్ రాసి గిఫ్ట్ గా చదివిన్చేస్తానులెండి ....

Sasidhar Anne said...

//పైన కామెంట్ పెట్టిన శశిధర్ గారు పెళ్ళికి ముందు కామెంట్ పెట్టారు ...ఇప్పుడు తన పెళ్లి అయిపొయింది కాని నేను పోస్ట్ రాయలేకపోయాను ...సో మీ పెళ్ళికి ముందే పోస్ట్ రాసి గిఫ్ట్ గా చదివిన్చేస్తానులెండి ....

Siva ranjani.. pelli ayipoyi nela ayindhi.. inka mee gift maku andaledu.. enti work lo full busy antunnaru.. edaina job lo join ayyara>

శివరంజని said...

హహహ శశిధర్ గారు అవునండి జాబ్ చేస్తున్నా.......... .కాని పోస్ట్ ఎందుకు రాయడం లేదు అంటే ఏమి సాకులు చెప్పి తప్పించుకోవాలో తెలియక......... పోస్ట్ రాయాలి అండి........ తొందరగా రాసేస్తా లేండి.......... ఇంతకీ మీరు పెళ్ళికి పిలవనేలేదు మమ్మల్ని :(

డేవిడ్ said...

next post eppudu madam

డేవిడ్ said...

next post eppudu madam

loknath kovuru said...

హాయ్ మాడం..నమస్తే............మీ బ్లాగ్ లోకి రావడం ఇదే మొదటిసారి ఏమనుకోకండి కంగారులో..ఏ కాలు పెట్టానో తెలియట్ల..అంత శుభమే జరుగుతుందని నను దీవించండి...ఫటాఫట్ ఏకబిగి అన్ని పోస్ట్ లని నెంబర్ వన్ సినిమాలో విలన్ ఇంట్లో బ్రహానందం పేపర్ ని ముక్కలు ముక్కలు గా చింపినట్టే చదివేసా...సుత్తి గా ఉన్న ముదిగారం (ముద్దు ముద్దు ) గా అనిపించాయ్..."ఎప్పుడోచ్చం అన్నది కాదన్నాముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా? అన్నదే" అన్నట్టు ఎన్ని రాసాము అన్నదానికంటే...ఎంత బాగా రాసాము అన్నదే ముఖ్యం అని అనుకున్నారేమో అనిపించింది....థాంక్స్ అంది..మీరు ఇంకా బాగా వ్రాయాలని మనసా..వాచ..కోరుకుంటూ....అన్నట్టు మీకు వ్రాయడం చాల బాగా వచ్చండి..

శివరంజని said...

loknath kovuru : గారు మీ అభిమానానికి ధన్యవాదములు ......

నెంబర్ వన్ సినిమాలో విలన్ ఇంట్లో బ్రహానందం పేపర్ ని ముక్కలు ముక్కలు గా చింపినట్టే చదివేసా...>>>>
హహహహః నా బ్లాగ్ ఇల్లు విలన్ ఇల్లా ???? ( J/K ) no offense plzz

కంగారులో..ఏ కాలు పెట్టానో తెలియట్ల..అంత శుభమే జరుగుతుందని>>>>>

పర్వాలేదండి మంచి మనసుతో ఏ కాలు ముందు పెట్టిన పర్వాలేదు . చంద్రునిపై ముందు అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా ఎడమకాలే పెట్టాడంట కదా ....... ముందు గా నా బ్లాగ్ కి సుస్వాగతం .... మీ అతి పెద్ద కామెంట్ కి ధన్యవాదములు